దసరా ఏర్పాట్లపై అత్యవసర బోర్డు భేటీ!
- పెండింగ్ అంశాలపై ప్రత్యేకంగా చర్చ
- సుమారు 20 అత్యవసర ఎజెండాలపై నిర్ణయాలు
- భక్తుల రద్దీ, హోల్డింగ్ పాయింట్లపై కసరత్తు
- వర్షం వస్తే ప్రత్యామ్నాయ మార్గాలపై ట్రయల్
- వాహనాలు, వీఐపీల రాకపోకలపై ప్రత్యేక ప్రణాళిక
- రాష్ట్రపతి రాకతో మరింత ప్రతిష్ఠాత్మకం కానున్న ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ట్రస్ట్ బోర్డు అత్యవసర సమావేశం గురువారం నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలోని మహామండపం నాలుగో అంతస్తులో ఉన్న ప్రత్యేక సమావేశ మందిరంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ ఆధ్వర్యంలో, కార్యనిర్వహణ అధికారి శీనా నాయక్ సమక్షంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్మన్ బొర్రా గాంధీ సమావేశ వివరాలను వెల్లడించారు.
సుమారు 20 పెండింగ్ అంశాలపై చర్చ..
దసరా ఉత్సవాలకు అత్యవసరంగా అవసరమైన పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సుమారు 20 ఎజెండాలను సమావేశంలో చర్చించినట్లు చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు. ముఖ్యంగా తాగునీరు తదితర అత్యవసర అవసరాలకు సంబంధించిన అంశాలతో పాటు ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించి, దాదాపు అన్ని అంశాలను ఆమోదించినట్లు చెప్పారు. మిగిలిన అంశాలపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
భక్తుల రద్దీపై క్షేత్రస్థాయి పరిశీలన..
దసరా సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చైర్మన్ బొర్రా గాంధీ చెప్పారు. బోర్డు సభ్యులు, అధికారులు, సిబ్బంది హోల్డింగ్ పాయింట్ల నుంచి వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి రద్దీ పరిస్థితిని అంచనా వేయనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది? ఎక్కడ అదనపు ఏర్పాట్లు చేయాలి? ఒక్కసారిగా సమస్య తలెత్తితే ఎలా పరిష్కరించాలి? అనే అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.
వర్షం వస్తే.. ప్రత్యామ్నాయ మార్గం
వర్షాలు కురిసినా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా చర్చించారు. ఇటీవల కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో వర్షం పడితే భక్తులను కనకదుర్గనగర్ నుంచి ఎలా తరలించాలి? ఎక్కడ హోల్డింగ్ చేయాలి? మహామండపం నుంచి ఏ మార్గంలో పంపాలి? అనే అంశాలపై ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.
11, 12 తేదీల్లో ట్రయల్ రన్..
వర్షం కారణంగా సాధారణ దర్శన మార్గంలో మార్పులు చేయాల్సి వస్తే చేపట్టాల్సిన ఏర్పాట్లను ముందుగానే పరీక్షించేందుకు 11, 12 తేదీల్లో ట్రయల్ నిర్వహించే ఆలోచన ఉన్నట్లు చైర్మన్ బొర్రాగాంధీ వెల్లడించారు. ప్రత్యామ్నాయ మార్గాలు, హోల్డింగ్ ప్రాంతాల్లో భక్తుల నిర్వహణ ఎలా ఉండాలన్న దానిపై ఈ ట్రయల్ ద్వారా స్పష్టతకు రానున్నారు.
హోల్డింగ్ ఏరియాల్లో.. సమయ సమాచారం..
భక్తులు హోల్డింగ్ ప్రాంతాల్లో వేచి ఉండాల్సి వస్తే వారికి దర్శనానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? ఎంతసేపు వేచి ఉండాలి? అనే సమాచారం అందించే విధానంపైనా చర్చించారు. భక్తులను క్రమబద్ధంగా తరలిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించి పంపేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
వాహనాలు.. వీఐపీలపై ప్రత్యేక ప్రణాళిక..
దసరా రద్దీ నేపథ్యంలో కార్లను ఎక్కడి వరకు అనుమతించాలి? వీఐపీల దర్శనాలను ఏ సమయం నుంచి ప్రారంభించాలి? వాహనాలను ఏ మార్గంలో అనుమతించాలి? పాస్‌ల విధానం ఎలా ఉండాలి? అనే అంశాలపైనా సమావేశంలో చర్చించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వాహనాల నియంత్రణ, వీఐపీ ప్రోటోకాల్ అమలుపై స్పష్టమైన విధానం రూపొందించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రపతి రాకతో ప్రత్యేక శోభ..
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానుండటం సంతోషంగా ఉందని చైర్మన్ బొర్రాగాంధీ తెలిపారు. గత ఏడాది ఉపరాష్ట్రపతి హాజరుకాగా, ఈసారి రాష్ట్రపతి రావడం ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకురానుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులతో పాటు సుమారు ఐదు నుంచి ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రానున్నట్లు సమాచారం ఉందని తెలిపారు.
అన్ని శాఖల సమన్వయంతో..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు, జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్, దేవాదాయ శాఖ కార్యదర్శి తదితరుల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించి సురక్షితంగా పంపించడమే లక్ష్యమన్నారు. పెండింగ్ అంశాలపై మరోసారి సమావేశం నిర్వహించి తుది నిర్ణయాలకు వస్తామని చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు.
