గాయత్రీ మాతగా అమ్మవారి దర్శనం

అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు సోమవారం శ్రీ గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం హోమాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం భక్తులకు భోజన సదుపాయం కల్పించడంతోపాటు, సాయంత్రం అమ్మవారికి పూజలు, కుంకుమార్చన అనంతరం బతుకమ్మ సంబరాలు, కోలాట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల అనంతరం భక్తులకు అల్పాహారం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసు నాగరాజు, ప్రధాన కార్యదర్శి చిలువేరు ధనరాజు, కోశాధికారి కర్నాటి రాములు, ఉపాధ్యక్షులు గంజి జగదీశ్వర్, పులిజాల అంజనికుమార్, కార్యదర్శులు బాలాజీ పరమేష్, ఇమ్మడి రమేష్ కార్యవర్గ సభ్యులు, కుల పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.