నాగోబా ఆశీస్సులతో దండారి ఉత్సవాలకు శ్రీకారం
కేస్లాపూర్లో ప్రత్యేక పూజలు..
సంప్రదాయ గుస్సాడి నృత్యాలతో సందడి చేసిన మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి,ఆంధ్రప్రభ: ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడి, దండారి ఉత్సవాలకు నాగోబా ఆశీస్సులతో మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబా ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి నాగదేవత ఆశీస్సులు పొందారు. గుస్సాడి, దండారి ఉత్సవాలను ప్రారంభించే ముందు నాగోబా దర్శనం చేసుకోవడం మెస్రం వంశీయుల ఆనవాయితీగా కొనసాగుతోంది.
నాగుల పంచమి, దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండుగల సందర్భంగా ఉత్సవాలు నిర్వహించే ముందు నాగోబా అనుమతి, ఆశీస్సులు పొందడం తమ సంప్రదాయమని మెస్రం వంశీయులు చెబుతున్నారు. ఇందులో భాగంగా మెస్రం పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, మాజీ సర్పంచ్ మెస్రం నాగనాథ్, స్థానిక సర్పంచ్ మెస్రం తుకారాం ఆధ్వర్యంలో కటోడాలు, ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుస్సాడి నృత్యాలకు ఉపయోగించే నెమలి ఈకల కిరీటాలు, గంగారాం సోటా, తుడుం డోలు, పెత్రి తదితర సంప్రదాయ వాయిద్యాలు, పరికరాలను నాగోబా సన్నిధిలో ఉంచి పూజించారు. అనంతరం గుస్సాడి వేషధారణలో దీక్ష తీసుకునే కళాకారులు ఆలయం వద్ద సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించి భక్తులను అలరించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు దండారి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
వారం రోజులపాటు ఉత్సవాల సందడి
నాగోబా పూజలు ముగిసిన అనంతరం మెస్రం వంశీయులు తమ తమ గూడేలకు వెళ్లి బంధుమిత్రుల ఇళ్లలో దండారి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీపావళి మరుసటి రోజు నుంచి కొలాబడి వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. సుమారు వారం రోజులపాటు ఆదివాసీ గూడేల్లో గుస్సాడి నృత్యాలు, సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొననుంది.
తెలంగాణ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు గుస్సాడి, దండారి ఉత్సవాలు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యేలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నారు. సంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ మెస్రం వంశీయులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొననున్నారు.
