ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వాలు పాటుపడాలి

దండారి దర్బార్‌లో ఎంపీ గెడెం నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

దండేపల్లి, ఆంధ్రప్రభ: ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. దండారి ఉత్సవాల్లో భాగంగా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలోని శ్రీ పద్మల్‌పురి కాకో ఆలయంలో గురువారం నిర్వహించిన దండారి దర్బార్‌కు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సంప్రదాయ వాయిద్యాలతో అతిథులకు స్వాగతం పలికి ఆలయం వరకు తోడ్కొని వెళ్లారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల గుస్సాడి నృత్యాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చుట్టూ దట్టమైన అరణ్యం, కొండకోనల మధ్య ఆవాసం, ప్రకృతితో మమేకమైన జీవనశైలి ఆదివాసీల ప్రత్యేకతలని పేర్కొన్నారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం ప్రకృతికి దగ్గరగా ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. తమ సంస్కృతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఆదివాసీలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. వారి జీవనశైలి ప్రకృతిని గౌరవించడం, సమాజాన్ని ప్రేమించడం నేర్పుతుందని పేర్కొన్నారు.

శ్రీ పద్మల్‌పురి కాకో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ గెడెం నగేశ్ తన వంతుగా రూ.10 లక్షలు అందజేయనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోట్నాక తిరుపతి, డీసీసీ మాజీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, సర్పంచ్ సంతపురి కళావతి, ఆర్జీపీఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ కొమురం హన్మంతు, ఆదివాసీ సంఘం మండల అధ్యక్షుడు కనక జంగు, గౌరవ అధ్యక్షుడు కుడిమెత సోము, నాయకులు లింగరావు, గోపాల్, మేస్రం రమేష్, అత్రం జలపతి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.