నాలా అనుమతుల రద్దుపై బాధితుల హర్షం

  • భూ హక్కుల పోరాటానికి న్యాయం జరిగిందన్న వి. దామోదరశెట్టి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మున్సిపల్‌ పరిధిలోని మారుతినగర్‌ శివారులో సర్వే నంబర్‌ 375లోని భూమికి సంబంధించి జారీ చేసిన నాలా అనుమతులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బాధితుల తరఫున వి. దామోదరశెట్టి హర్షం వ్యక్తం చేశారు. భూ హక్కుల పరిరక్షణ కోసం బాధితులు సాగించిన న్యాయపోరాటానికి తీర్పు ద్వారా న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

సర్వే నంబర్‌ 375కు సంబంధించి జి/346/2014 ఫైల్‌పై 2014 ఏప్రిల్‌ 11న, అనంతరం డి3/1892/2016 ఫైల్‌పై 2019 ఫిబ్రవరి 13న నాలా అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయినట్లు దామోదరశెట్టి తెలిపారు. అయితే సదరు భూమిపై వారసుల మధ్య హక్కులు, విభజనకు సంబంధించిన వివాదం సివిల్‌ కోర్టులో కొనసాగుతున్న సమయంలోనే నాలా అనుమతులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ వి. సునందమ్మ హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సివిల్‌ హక్కులకు సంబంధించిన వివాదం పరిష్కారం కాకముందే నాలా అనుమతులు జారీ చేసిన అంశాన్ని పరిశీలించింది. అనంతరం 2019లో జారీ చేసిన డి3/1892/2016 నాలా అనుమతి ఉత్తర్వులను 2026 సెప్టెంబర్‌ 15న రద్దు చేసినట్లు దామోదరశెట్టి తెలిపారు.

బాధితుల పోరాటానికి న్యాయం

తమ హక్కుల పరిరక్షణ కోసం బాధితులు చేసిన న్యాయపోరాటానికి కోర్టు తీర్పు బలాన్నిచ్చిందని దామోదరశెట్టి అన్నారు. తీర్పు పట్ల బాధితుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులు, గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, తదుపరి అనుమతులు, లావాదేవీలను అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. ఇలాంటి వివాదాస్పద భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.