delhi hotel| మంత్రి, ఎమ్మెల్యేకు టీపీసీసీ పిలుపు!

మంత్రి, ఎమ్మెల్యేకు టీపీసీసీ పిలుపు!

  • దామోదర రాజనర్సింహ–లక్ష్మీకాంతరావు వివాదంపై పార్టీ పెద్దల జోక్యం
  • ఢిల్లీ హోటల్‌లో వాగ్వాదం.. ఇరువురు నేతలతో గురువారం ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి సి. దామోదర రాజనర్సింహ, జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య తలెత్తిన వివాదం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఇరువురు నేతల మధ్య జరిగిన వాగ్వాదం, పరస్పర ఆరోపణలపై టీపీసీసీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ వివాదానికి తెరదించి, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం గాంధీభవన్‌కు రావాలని మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావులకు సూచించింది.

డీసీసీ అధ్యక్షుడి నియామకమే వివాదానికి కారణమా?

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి నియామకంతోపాటు ఇతర పార్టీ పదవుల పంపకాల విషయంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఢిల్లీ హోటల్‌లో తీవ్ర వాగ్వాదం

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఇరువురు నేతల మధ్య అక్కడి ఓ హోటల్‌ లాబీలో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. తనను మంత్రి దామోదర రాజనర్సింహ అసభ్య పదజాలంతో దూషించారని, భౌతిక దాడికి దిగేలా బెదిరించారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆరోపించినట్లు సమాచారం. తోటి ఎమ్మెల్యేల సమక్షంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అధిష్ఠానానికి ఎమ్మెల్యే ఫిర్యాదు

ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేయగా, ఏఐసీసీ పెద్దలకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

వివాదానికి ముగింపు పలికే యత్నం

ఇరువురు నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో గురువారం గాంధీభవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇరువురి వాదనలు విని, సమస్యను పరిష్కరించేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీతో వివాదానికి తెరపడుతుందా? పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.