రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు మల్కాపూర్‌ విద్యార్థిని ఎంపిక

అండర్‌-17 జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ.. అభినందించిన సర్పంచ్‌, ఉపాధ్యాయ బృందం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని యు. మేఘన ఫుట్‌బాల్‌లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. నల్గొండ జిల్లా చర్లపల్లిలో ఈ నెల 1న ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్‌బాల్‌ బాలికల జూనియర్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-17 బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో మేఘన ప్రతిభ కనబరిచింది.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు నిజామాబాద్‌లో జరగనున్నాయి. ఈ పోటీల్లో మేఘన పాల్గొననుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల దండు మల్కాపూర్‌ గ్రామ సర్పంచ్‌ గిర్కటి నిరంజన్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ నరసింహ, ఎంఈఓ గురువారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, క్రీడా ఉపాధ్యాయురాలు భావనతో పాటు ఇతర ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మేఘనను అభినందించిన సర్పంచ్‌ నిరంజన్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మేఘన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు గ్రామపంచాయతీ తరఫున అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.