స్వర్ణగిరిలో శ్రీవారి నిత్య కల్యాణం..

  • ఘనంగా తిరువీధి సేవ

భువనగిరి (రూరల్ ), ఆంధ్రప్రభ : జిల్లాలోని ఆధ్యాత్మిక స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణోత్సవం, తిరువీధి ఉత్సవం భక్తుల గోవింద నామస్మరణల నడుమ అంగరంగ వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పగా, గోపృష్ట దర్శనం నిర్వహించి, బంగారు బావి నుండి సువర్ణ బిందె తీర్థాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వయంభువ సేవకు తీసుకువచ్చారు. శ్రీవారిని మణిమయ స్వర్ణాభరణాలు, పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం శ్రీ సుదర్శన నారసింహ హవనం జరిపారు.

వైభవోత్సవ మండపంలో శ్రీవారి నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంగళధ్వనుల మధ్య కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించి భక్తులు ఆనందపరవశులయ్యారు. ప్రతిరోజూ నిర్వహించే అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 3 వేల మందికి పైగా భక్తులు శ్రీవారి నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారిని మాడవీధుల్లో మేళతాళాలు, మృదంగ ధ్వనుల మధ్య శోభాయమానంగా ఊరేగించారు. తిరువీధి ఉత్సవం అనంతరం దేదీప్యమానంగా వెలిగే సహస్రదీప కాంతుల మధ్య స్వామివారు ఊయల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు కర్పూర మంగళహారతులు సమర్పించగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.