Cyclone Murasu Latest Update | తీరాన్ని తాకిన తుపాను.. 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు!

తీరాన్ని తాకిన తుపాను ప్రధాన మేఘావృత ప్రాంతం..
కొనసాగుతున్న ల్యాండ్‌ఫాల్‌ ప్రక్రియ
ఒంగోలు సమీపంలో తీరంలోకి ప్రవేశిస్తున్న తుపాను కేంద్రం..
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
ఒడిశాలోనూ హై అలర్ట్‌
ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు

అమరావతి, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకుతోంది. మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరంలోకి ప్రవేశించే ప్రక్రియ ప్రారంభమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా సమాచారం ప్రకారం.. తుపానుకు సంబంధించిన ప్రధాన మేఘావృత ప్రాంతం (వాల్‌ క్లౌడ్‌) ఇప్పటికే భూభాగాన్ని తాకగా, తుపాను కేంద్ర బిందువు (ఐ) తీర ప్రాంతంలోకి ప్రవేశిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

భారీ వర్షాలు.. బలమైన గాలులు

తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుపాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి అత్యంత సమీపంలో కేంద్రీకృతమై ఉంది.తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

*ఒంగోలు సమీపంలోనే తీర ప్రవేశం

తుపాను కదలికలపై ఐఎండీ విడుదల చేసిన ముందస్తు వివరాల ప్రకారం.. ఇది ఒంగోలుకు ఆగ్నేయంగా సుమారు 30 కిలోమీటర్లు, కావలికి ఈశాన్యంగా 50 కిలోమీటర్లు, నెల్లూరుకు ఉత్తర-ఈశాన్యంగా 100 కిలోమీటర్లు, మచిలీపట్నానికి నైరుతి దిశగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నెల్లూరు నుంచి నర్సాపురం మధ్య, ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఒడిశాలోనూ అప్రమత్తత

మురసు తుపాను ప్రభావం దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్‌, మల్కన్‌గిరి జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్‌ పూజారి వెల్లడించారు.గజపతి, గంజాం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

నవంబర్‌లో వర్షాలు తక్కువ.. ఉష్ణోగ్రతలు ఎక్కువ

మరోవైపు నవంబర్‌ నెలకు సంబంధించి వాతావరణ శాఖ కీలక అంచనాలను వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ నెల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

2026 అక్టోబరు నెలలో దేశ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1901 తర్వాత అత్యధిక స్థాయికి చేరినట్లు ఆయన వెల్లడించారు. ఒకవైపు తుపాన్లు, భారీ వర్షాలు.. మరోవైపు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతల అంచనాలు వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న మార్పులను సూచిస్తున్నాయి.