ఆశ చూపాడు,అందినకాడికి దోచాడు

ఆశ చూపాడు,అందినకాడికి దోచాడు
- పాత చిట్టీదారులకు ఇన్సూరెన్స్ వస్తుందంటూ సైబర్ వల
దమ్మపేట, ఆంధ్రప్రభ: గతంలో చిట్ ఫండ్ కంపెనీలో సభ్యులుగా ఉన్న వారి వివరాలను ఆసరాగా చేసుకుని, ఇన్సూరెన్స్ పేరుతో ఒక ప్రబుద్ధుడు సరికొత్త సైబర్ దోపిడీకి పాల్పడ్డాడు. చిట్టీలు కట్టిన వారికి అదనపు డబ్బులు వస్తాయని నమ్మబలికి, ఒక్కొక్కరి దగ్గర రూ. 5 వేల చొప్పున వసూలు చేస్తూ బురిడీ కొట్టిస్తున్నాడు. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఓ చిట్ ఫండ్స్ సంస్థ 2015లో సత్తుపల్లిలో బ్రాంచ్‌ను నిర్వహించిన సమయంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,దమ్మపేట మండలానికి చెందిన పలువురు అందులో చిట్టీలు వేశారు.
ఆ సమయంలో వారు సక్రమంగానే తమ డబ్బులను వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో సభ్యులుగా ఉన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు సేకరించిన ఓ వ్యక్తి ఇప్పుడు వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. గత జనవరి నెలలో ఒక వ్యక్తి బాధితులకు ఫోన్ చేసి మీరు గతంలో చిట్ ఫండ్ లో సభ్యులుగా ఉన్నందుకు గాను, కంపెనీ మీకు ఇన్సూరెన్స్ చేసింది. ఆ క్లెయిమ్ కింద ఇప్పుడు మీకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు వస్తాయని ఆశ చూపాడు. ఆ ఇన్సూరెన్స్ సొమ్ము మీ ఖాతాల్లో జమ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం మనిషికి రూ. 5 వేలు చెల్లించాలని నమ్మబలికాడు. అతని మాటలు నిజమేనని నమ్మిన బాధితులు ఫోన్-పే ద్వారా నగదు బదిలీ చేశారు.
డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి గత ఐదు రోజులుగా బాధితుల ఫోన్లకు స్పందించడం లేదు.
బాధితులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలాగే పాత చిట్టీల డేటా ఆధారంగా మరికొందరు కూడా ఈ మాయగాడి వలలో పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అధికారులు స్పందించి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
