రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ వార్నింగ్!
‘1980s లుక్’ పేరుతో వచ్చే యాప్స్ పట్ల జాగ్రత్త..
వ్యక్తిగత ఫొటోలు, డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం
ఏఐ మార్ఫింగ్‌తో నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించే ప్రమాదం
సైబర్ పోలీసులు హెచ్చరిక
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారుతున్న 1980ల నాటి రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ పోలీసులు అప్రమత్తం చేశారు. ట్రెండింగ్ పేరుతో వచ్చే తెలియని యాప్స్, ఏపీకే (APK) ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. ఇలాంటి యాప్స్ ద్వారా వ్యక్తిగత ఫొటోలు, మొబైల్‌లోని కీలక సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ట్రెండ్ పేరుతో మోసాలకు అవకాశం
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది తమ ఫొటోలను 1980ల కాలం నాటి స్టైల్‌లోకి మార్చుకునేందుకు వివిధ ఏఐ (AI) ఆధారిత యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నకిలీ యాప్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయని పోలీసులు తెలిపారు. ట్రెండ్ పేరుతో వచ్చే గుర్తుతెలియని లింకులు, ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు ఫోన్‌లోని ఫొటోలు, వ్యక్తిగత సమాచారం, ఇతర డేటాను సేకరించే అవకాశం ఉందన్నారు.
ఫొటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసే విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు సూచించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, పిల్లలు, వ్యక్తిగత వివరాలు కనిపించే ఫొటోలను తెలియని ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయవద్దని తెలిపారు. ఏఐ సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి నకిలీ చిత్రాలు, వీడియోలుగా మార్చే అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు.
మార్ఫింగ్‌తో బెదిరింపుల ప్రమాదం
సైబర్ నేరగాళ్లు ఏఐ టూల్స్ ఉపయోగించి ఫొటోలను మార్చి బాధితులను బెదిరించడం, డబ్బులు డిమాండ్ చేయడం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. తెలియని యాప్‌లకు ఫొటోలు, గ్యాలరీ, స్టోరేజ్, కెమెరా అనుమతులు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
సురక్షిత యాప్స్‌నే వినియోగించాలి
ఏఐ ఫొటో ఎడిటింగ్ లేదా ఇతర సేవలు ఉపయోగించే సమయంలో అధికారిక యాప్ స్టోర్లలో లభించే విశ్వసనీయ యాప్స్‌నే ఎంచుకోవాలని సైబర్ పోలీసులు తెలిపారు. అనుమానాస్పద లింకులు, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో వచ్చే ఫైల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే అయినా.. వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత విషయంలో అప్రమత్తత తప్పనిసరి అని సైబర్ పోలీసులు స్పష్టం చేశారు.
