Cultural | ఉట్టిపడిన భక్తి పరవశం

Cultural | ఉట్టిపడిన భక్తి పరవశం
- సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహా శివరాత్రి శివజాగరణ
- వేలాదిగా తరలివచ్చిన శివ భక్తులు
- భక్తులను ఆకట్టుకున్న సంగీత విభావరి
- పట్టణంలో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక వైభవం
Cultural | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం భక్తి పరవశమైంది. శివనామ స్మరణతో, ఆధ్యాత్మిక శోభతో పట్టణమంతా శివమయం అయింది. ఆలయాలు, వీధులు, ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శివజాగరణ సంగీత విభావరి కార్యక్రమాలు రాత్రంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు, శివభక్తులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
భక్తుల కోర్కెలు తీర్చే దేవుడు పరమేశ్వరుడని, నియమ నిష్ఠలతో ఆరాధిస్తే కరుణించే దేవుడు బోలా శంకరుడేనని పేర్కొన్నారు. ఇష్టదైవంగా ఈశ్వరుడిని స్మరించడం ద్వారా ఆధ్యాత్మిక భావన మరింత బలపడుతుందని తెలిపారు. భక్తి–సాంస్కృతిక సమన్వయంతో రూపొందించిన కార్యక్రమాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి. శివసహస్రనామాలు, భజనలు, ఆధ్యాత్మిక సందేశాలతో పాటు వైవిధ్యభరిత సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ప్రముఖ గాయకులు ఆలపించిన శివభక్తి గీతాలు జనసమూహాన్ని ఉర్రూతలూగించాయి. వీణావాయిద్యాలు, వేదోక్త మంత్రోచ్చారణలు కార్యక్రమానికి ప్రత్యేక మనోహరతను చేకూర్చాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల భక్తులు శివభక్తిలో లీనమై శివజాగరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండటంతో పాటు స్వచ్ఛంద సేవకుల సేవలు ప్రశంసనీయంగా నిలిచాయి.

కార్యక్రమాలు ప్రశాంతంగా, శ్రద్ధాభక్తులతో సాగాయి. మొత్తంగా మహా శివరాత్రి వేడుకలు సంగారెడ్డిలో భక్తి, సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా నిలిచి, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ముద్ర వేసాయి. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, ప్రముఖ సింగర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
