యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయండి
ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గే అవకాశం..
రైతులకు ఏఓ రమ్యశ్రీ సూచన
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ: ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉన్నందున యాసంగిలో రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారిణి టి. రమ్యశ్రీ సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధిక నీరు అవసరమయ్యే వరి సాగుతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో సాగు చేయగల పెసర, మినుము, శనగ, జొన్న, సజ్జ వంటి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు. పంట మార్పిడితో నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.ఈ సమావేశంలో గ్రామ ఉపసర్పంచ్ శేఖర్, పంచాయతీ కార్యదర్శి సౌందర్య, రైతులు బోనగిరి భాస్కర్, బద్దం రమేష్, నరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
