లారీని వెనుక నుంచి ఢీకొట్టిన క్రషర్ లారీ…

​టార్పాలిన్ కడుతుండగా విరుచుకుపడ్డ మృత్యువు : అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం


​మేడ్చల్, సెప్టెంబర్1 (ఆంధ్రప్రభ): ​మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం నుంచి లోడును కాపాడుకునేందుకు లారీపై టార్పాలిన్ కడుతున్న ఓ వ్యక్తిని మరొక లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి ప్లైవుడ్ లోడుతో మియాపూర్ వెళ్తున్న TS 05 UC 2959 నంబర్ గల టిప్పర్ లారీని తెల్లవారుజామున 3:30 నుంచి 4:00 గంటల మధ్య వర్షం రావడం వల్ల డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపాడు. లారీలోని ప్లైవుడ్ తడవకుండా ఉండేందుకు బీహారీ రాయ్ (35) అనే వ్యక్తి లారీపైకి ఎక్కి టార్పాలిన్ కడుతున్నాడు.

​అదే సమయంలో కీసర నుంచి తెల్లాపూర్ వైపు అధిక క్రషర్ లోడుతో వేగంగా వెళ్తున్న TG 07 X 5510 నంబర్ గల 16 టైర్ల లారీ.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్లైవుడ్ లారీని వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర ప్రమాదంలో లారీపై నుంచి కిందపడిన బీహారీ రాయ్ తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


​సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.