లారీ ఢీకొని సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
వడుకాపూర్‌లో విషాదఛాయలు

పసర, ఆంధ్రప్రభ : గోవిందరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు వాహనంలో వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది వాహనాన్ని పసర ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. జూలపల్లి మండలం వడుకాపూర్‌కు చెందిన మొగురం రమాకాంత్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గిరీష్‌కుమార్‌ (51), ప్రేమ్‌ ప్రకాశ్‌ (27), రామ్‌జన్‌ ప్రసాద్‌ (50) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సహాయంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రమాకాంత్‌ మృతితో ఆయన స్వగ్రామం వడుకాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. జవాన్‌ మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.