Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ…

దసరా నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు..
ఆలయ పనులను పరిశీలించిన కన్నబాబు, రామచంద్ర మోహన్‌
భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
అమ్మవారికి బంగారు హారం సమర్పించిన భక్తుడు
సామూహిక వరలక్ష్మీ వ్రతాల ఉచిత టికెట్ల పంపిణీ ప్రారంభం
ఒక్కరోజే 33,685 మంది భక్తుల దర్శనం


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రావణ మాసం నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమవారం వివరాలు…

ఆగస్టు 31 సోమవారం న 33,685 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా.. 5,074 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. భక్తులకు 42,201 ప్రసాదం యూనిట్లు అందించారు. అన్నదానంలో 7,105 మంది పాల్గొన్నారు. హుండీ, విరాళాల రూపంలో రూ.2,89,766 ఆదాయం సమకూరింది. 397 సేవలు, 1,278 తలనీలాల సమర్పణలు జరిగాయి.

దసరాకు ముందే పనులు పూర్తి చేయాలి..

ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కన్నబాబు, దేవాదాయశాఖ కమిషనర్‌ కే.రామచంద్ర మోహన్‌ పరిశీలించారు. దసరా ఉత్సవాలకు భక్తుల రాక భారీగా ఉండే అవకాశం ఉన్నందున అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలని ఆదేశించారు.

అమ్మవారికి బంగారు హారం కానుక..

కనకదుర్గమ్మకు ఓ భక్తుడు బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీని కలిసి హారాన్ని అందజేశారు. ఆలయ అధికారులు భక్తుడి కానుకను స్వీకరించారు.

వ్రతాల టికెట్ల పంపిణీ షురూ.

ఈ నెల 4న నిర్వహించనున్న సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించి ఉచిత టికెట్ల పంపిణీ ప్రారంభమైంది. ఆలయ చైర్మన్‌ బొర్రా గాంధీ టికెట్ల పంపిణీని ప్రారంభించారు. వ్రతానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.