గడ్డి మందు పిచికారీతో పంట ధ్వంసం..

16 గుంటల వరి పొలం పూర్తిగా ఎండిపోయిన వైనం
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రైతు..
రూ.50 వేల వరకు నష్టం..
వెల్గటూర్ ,ఆంధ్రప్రభ: పంట చేతికొచ్చే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పొలానికి గడ్డి మందు పిచికారీ చేయడంతో వరి పంట పూర్తిగా ధ్వంసమ‌యింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల ప‌రిధి జగదేవుపేట గ్రామంలో చోటుచేసుకుంది. నోటికాడికి వచ్చిన పంట కళ్లముందే ఎండిపోవడంతో రైతు బద్ధం మాధవరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామానికి చెందిన మాధవరెడ్డి సొంత పొలం16 గుంటల భూమిలో వరి సాగు చేశాడు. పంట ఏపుగా పెరిగి చేతికొచ్చే దశకు చేరుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళ పొలంలోకి చొరబడి గడ్డి మందు పిచికారీ చేసినట్లు రైతు ఆరోపించాడు. దీంతో కొద్ది రోజుల్లోనే వరి పంట మొత్తం ఎండిపోయి పూర్తిగా ధ్వంసమైంది. పొలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా, ఐదు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి గడ్డి మందు పిచికారీ చేస్తున్న దృశ్యాలు రికార్డు అయినట్లు రైతు వెల్లడించాడు. పంటను కావాలనే నాశనం చేసేందుకు గడ్డి మందు పిచికారీ చేసినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. ఈ భూమిని తాను రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అప్పటి నుంచి భూమి విషయంలో వివాదం కొనసాగుతోందని పేర్కొన్నాడు. గతంలోనూ సదరు వ్యక్తి ఈ పొలం తనదేనంటూ, తాను నాటు వేసిన పంటను సైతం ధ్వంసం చేసినట్లు చెప్పారు. తాజాగా మళ్లీ పంటను గడ్డి మందుతో పూర్తిగా నాశనం చేయడంతో తన కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పట్టా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు మాధవరెడ్డి పోలీసులను వేడుకున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు జరిగిన పంట నష్టాన్ని అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రైతు కోరుతున్నాడు.