బైక్‌పై నుంచి కిందపడి యువకుడి దుర్మరణం

బైక్‌పై నుంచి కిందపడి యువకుడి దుర్మరణం

చౌటుప్పల్, ఆంధ్ర‌ప్ర‌భ : బైక్‌పై వెళ్తూ నిద్రమత్తులో కిందపడిన యువకుడిని వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన కుంచె లారెన్స్‌ (26) ప్రైవేట్‌ ఉద్యోగం కోసం రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఎర్రగడ్డలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన రూమ్‌మేట్‌ శివప్రసాద్‌తో కలిసి పల్సర్‌ బైక్‌ పై కాకినాడకు బయలుదేరారు.

పంతంగి టోల్‌గేట్‌ వద్దకు చేరుకున్న తర్వాత లారెన్స్‌ తనకు నిద్ర వస్తోందని చెప్పడంతో వారు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలోని ఆందోల్‌ మైసమ్మ గుడి సమీపానికి చేరుకోగానే లారెన్స్‌ నిద్రమత్తులో బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై లారెన్స్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీకోటి సుధాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్‌ సీఐ జి. మన్మధకుమార్‌ తెలిపారు.