వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన
- చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని కమ్మర్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమంతో పాటు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరుణ్‌కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారులు శ్రీనివాస్, చంద్రమౌళి హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. సాయన్నతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అటవీ అధికారులు, ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వన్యప్రాణుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకుని, ప్రకృతి సంరక్షకులుగా మారాలని పిలుపునిచ్చారు.
ఉత్సాహంగా చిత్రలేఖన పోటీలు
వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు సంబంధించిన అంశాలపై ఆకట్టుకునే చిత్రాలను గీశారు. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో విజేతలకు అటవీ శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుడి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
పోటీల్లో పదో తరగతి విద్యార్థిని రాణి ప్రథమ బహుమతి సాధించగా, బుసరా ద్వితీయ, భవ్యశ్రీ తృతీయ బహుమతులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయులు బి. రోహిత్, జే. సంజీవ్‌కుమార్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
