CPM | ఉపాధి నిర్వీర్యానికి కుట్ర

CPM | ఉపాధి నిర్వీర్యానికి కుట్ర

  • సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్‌సీపీ రెడ్డి
  • ఆర్డీఓ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న‌

CPM | గుడివాడ, ఆంధ్రప్రభ : గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో చట్ట సవరణ చేయటం దారుణమని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్‌సీపీ రెడ్డి అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్ర‌హం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఆ చట్టం చేసినప్పుడు కనీసం వంద రోజులు పని దినాలు కల్పించాలని చెప్పారని, ఇపుడు వీబీజీఆర్ఎఎంజీ (వికసిత భారత్ గ్యారెంటీ అండ్ ఆజ్కా వికాస్) పేరుతో ఆమోదించిన బిల్లులో జాతిపిత పేరును తొలగించడమే కాక పలు కొత్త నిబంధనలు చేర్చి ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికుల సంఖ్యను సగానికి పైగా కుదించేలా చేశారని ఆరోపించారు. రానున్న కాలంలో ఈ నిరంకుశ చట్టానికి వ్యతిరేకంగా వామపక్షాలను లౌకికవాదులను కలుపుకొని ఉధృతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

పట్టణ కమిటీ సభ్యులు లంకా సురేంద్ర మాట్లాడుతూ.. ఈ చట్టం రాకముందే రాష్ట్రంలో కుంటి సాకులతో 12లక్షల 73వేల మంది ఉపాధి కార్మికులను అనర్హులుగా ప్రకటించారని, ఈ చట్టం అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్ శక్తులకు 19 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చిందని, సామాన్యులకు కొద్దిపాటి ఉపశమనంగా ఉన్న సంక్షేమ పథకాలకు తిలోద‌కాలిస్తుందని ఆరోపించారు. శాశ్వత వలసదారులు, హౌసింగ్ లబ్ధిదారులు, 80 సంవత్సరాలు దాటిన వారు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కాని వారు, ఉద్యాన పంటల సాగుదారులు ఇలా పలు రకాలు నిబంధనలు పెట్టి వారందరినీ అనర్హులుగా ప్రకటిస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎదురించకపోగా, అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ మోడీని సమర్ధించటం సిగ్గుచేటన్నారు. ఈ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర వాదులందరూ ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం మాట్లాడుతూ.. ఉపాధి కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులను చైతన్యపరచి వారికి చేదోడు వాదోడుగా పోరాటం అందిస్తామన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి రజిని, ఆర్ కొండ, పి వీరమ్మ, ఏ విజయ్ కుమార్, ఎం నారాయణ, ఎస్ శ్రీనివాస్, కే సురేష్, సి హెచ్ రాంబాబు, మెరుగుమాల ఝాన్సీ, వైవి సుబ్బారావు, అబ్దుల్ అజీజ్, రైతు నాయకులు సొంటి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply