ఎద్దుల బండిపై సీపీఐ పోరాటం..

ఎద్దుల బండిపై సీపీఐ పోరాటం..

ఇంధన ధరలపై నల్లమాడలో వినూత్న నిరసన!

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్

నల్లమాడ, ఆంధ్రప్రభ: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు మంగళవారం నల్లమాడలో వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎద్దుల బండితో ఆందోళన నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చలపతి నాయుడు, మండల కార్యదర్శి వలిపి వెంకటరమణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు.

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపై పడుతోందని, రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ఉత్పత్తులపై అధిక పన్నులు విధించడం వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు స్పందించకపోతే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు గంగాధర్, సుధాకర్, పూల శ్రీనివాసులు, దేవేంద్ర, రామలక్ష్మి, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు. ఎద్దుల బండితో నిర్వహించిన ఈ వినూత్న నిరసన స్థానికంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.

Leave a Reply