సోషల్‌ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు

  • ప్రజాప్రతినిధిని ఉద్దేశించి వ్యాఖ్యలు.. 2018 బ్యాచ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌
  • పోలీస్‌ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారని చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సోషల్‌ మీడియాలో ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌పై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.ఎం.రమేష్ పైసస్పెన్షన్‌ వేటు వేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన కె.అనిల్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం సైబరాబాద్‌ నగర ఆర్మ్డ్‌ రిజర్వ్‌ విభాగం నుంచి తాత్కాలిక విధులపై హైదరాబాద్‌ నగర ఆర్మ్డ్‌ రిజర్వ్‌ ప్రధాన కార్యాలయంలో అనిల్‌ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ ప్రజాప్రతినిధిని ఉద్దేశించి ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో వ్యవహారాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు.

పోలీస్‌ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని తప్పనిసరిగా పాటించాలని సీపీ ఎం. రమేష్‌ స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది వ్యక్తిగతంగా సోషల్‌ మీడియాను వినియోగించే సమయంలోనూ బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు పోలీస్‌ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నట్లు అధికారులు గుర్తించిన నేపథ్యంలో అనిల్‌పై నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌ చర్యలు తీసుకున్నారు. పోలీసు ఉద్యోగులు సోషల్‌ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు.

శాఖా క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యవహరించే సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని పోలీస్‌ అధికారులు స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వినియోగంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.