గణేష్ ఉత్సవాలపై సీపీ, హైడ్రా, జీహెచ్‌ఎంసీ ఫోకస్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జన ఊరేగింపు మార్గంలో ఉన్నతాధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, ఐపీఎస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, ఐఏఎస్, నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్, అదనపు పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, ఐపీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు గణేష్ నిమజ్జన ఊరేగింపు సాగే మార్గాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రూట్‌లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, భద్రతా చర్యలు, ఊరేగింపు ఏర్పాట్లపై సమీక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పనిచేసే విధానంపైనా అధికారులతో చర్చించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
గణేష్ నవరాత్రి వేడుకలను భక్తులు ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత, పౌర సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
