విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మూగజీవం బలి..

  • కరెంట్ తీగ నోట్లో వెళ్లి గోమాత మృత్యు వాత
  • పండుగ రోజు నిజామాబాద్‌లో విషాదం

నిజామాబాదు అర్బన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ నగరంలోని 45వ డివిజన్ పరిధిలో విద్యుత్ శాఖ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం ఒక మూగజీవం ప్రాణం తీసింది. నేలపడి ఉన్న విద్యుత్ తీగను నోట్లో పెట్టుకోవడంతో అమాయకమైన ఆవు (గోమాత) విద్యుత్ ఆఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సకల దేవతలు కొలువై ఉండే గోమాతను పండుగ రోజు కోల్పోవడంతో స్థానికులు, గోరక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనం తిరిగే ప్రాంతంలో తెగిపడిన విద్యుత్ తీగలు అలాగే వేలాడుతున్నా సంబంధిత సిబ్బంది, అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది బాధ్యతారహిత్యమే ఈ ప్రాణనష్టానికి కారణమని, ఎవరి తప్పు వల్ల ఈ అనూహ్య ఘటన జరిగిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే విద్యుత్ శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్ పరిశీలనకు వచ్చినా, పండుగ పూట ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం సర్వత్రా కలకలం రేపింది.

సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ రోజు గోమాత మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దారుణ ఘటనపై గోరక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న వెంటనే 45వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో జేసీబీ ద్వారా ఆవు మృతదేహాన్ని మురికి కాలువ నుండి బయటకు తీయించి, సురక్షిత ప్రాంతానికి తరలించి స్వయంగా దహన సంస్కారాలు నిర్వహించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే అప్రమత్తమై ప్రమాదకరంగా ఉన్న తీగలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.