ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : 12 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన మహమ్మద్ మొక్రం (Mohammed Mokram) కు ఉరిశిక్ష విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు మెజిస్ట్రేట్ రోజా రమణి గురువారం సంచలన తీర్పుఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలో 2013 ఏప్రిల్ 28న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ ఖాన్ గూడలో 12 సంవత్సరాల మైనర్ బాలికపై మహమ్మద్ మొక్రం అత్యాచారం చేసి, హత్య చేశాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు (Chargesheet filed) చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పోక్సో చట్టం (POCSO Act) 2012లోని సెక్షన్ 6 కింద నిందితుడిని దోషిగా నిర్ధారించింది. నిందితునికి ఉరిశిక్షతో పాటు రూ.1,10,000 జరిమానా విధించగా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆ బాలిక తల్లి మాట్లాడుతూ… సంఘటన జరిగిన 12సంవత్సరాల తరువాత తమ కుటుంబానికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ఊరిశిక్షనే సరైనదని తెలిపారు. ఈ తీర్పుతోనైనా ఉన్మాదుల్లా ప్రవర్తించే రాక్షసుల్లో భయమన్నది కలగాలని ఆమె ఆకాంక్షించారు.

