(విశాఖపట్నం-ఆంధ్రప్రభ బ్యూరో) : ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8గంటల నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పర్యవేక్షణలో ఈనెల 27న జరిగిన పోలింగ్ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా చేపడుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో పది మంది అభ్యర్థులున్నారు. కోసూరు రాధాకృష్ణ, పాకలపాటి రఘువర్మ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి, కోరెడ్ల విజయ గౌరీ, నూకల సూర్యప్రకాశ్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు, పోతల దుర్గారావు, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావులు ఉన్నారు.
అయితే ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 22,493 మంది ఓటర్లు ఉండగా 92.40 శాతం ఓటింగ్ జరిగింది. ఎన్నికల పరిశీలకులు ఎం.ఎం.నాయక్ పర్యవేక్షణలో ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరిగింది. విశాఖపట్నం జిల్లాలోని 13పోలింగ్ కేంద్రాల పరిధిలో 5,529 ఓటర్లు ఉండగా, సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 4,829 మంది వారి హక్కును వినియోగించుకున్నారు. అంటే 87.34 శాతం ఓటింగ్ జరిగింది. ఉత్తరాంధ్ర పరిధిలోని ఆరు జిల్లాల్లో 22,493 మంది ఓటర్లు ఉండగా 20,783 మంది ఓటేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 92.40శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 5,529 ఓటర్లు కలిగిన విశాఖపట్నం జిల్లాలో 4,829 మంది వారి హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 87.34 శాతం ఓటింగ్ నమోదైంది.
విజయనగరం జిల్లాలో 5,223మంది ఓటర్లు ఉండగా 4,912 మంది ఓటేశారు. 94.05శాతం పోలింగ్ నమోదైంది. పార్వతీపురం జిల్లాలో 93.74శాతం పోలింగ్ నమోదవ్వగా 2,333 ఓటర్లకు గాను 2,187మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 2,885ఓట్లు ఉండగా 2,776 పోలయ్యాయి. 96.22 శాతం పోలింగ్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,488 మందికి గాను 1,310 మంది వారి హక్కును వినియోగించుకున్నారు. 88.04శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 5,035 మంది ఓటర్లు ఉండగా 4,769 మంది ఓటేయ్యగా 94.72 శాతం పోలింగ్ నమోదైంది.
ఇవాళ ఉదయం నుండి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిఘా నీడలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు చేస్తూ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, నగర్ పోలీస్ కమిషనర్ బాగ్చి ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక కౌంటింగ్.
19813 ఓట్లు గాను ( పి అర్ టి యూ ) గాదె శ్రీనివాసులు నాయుడుకు 6927 ఓట్లు, (ఏపీటీఎఫ్, కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి)
పాకలపాటి రఘు వర్మ 6596 ఓట్లు, (యూటిఎఫ్) కే.విజయ గౌరీ కి 5684 ఓట్లు వచ్చాయి. ప్రధాన అభ్యర్థులు పాకలపాటి రఘువర్మ, గాదె శ్రీనివాసులు మధ్య 331 ఓట్ల వ్యత్యాసం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం సిద్దమవుతోంది.
