తిరుపతిలో ఆలస్యంగా కౌంటింగ్.. 10 గంటలు దాటినా ప్రారంభంకాని ప్రక్రియ
తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. ఉదయం 10 గంటలు దాటినా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు ఓట్ల కట్టలు కట్టే పనిలో నిమగ్నమయ్యారు. కౌంటింగ్ ప్రారంభం కోసం అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో అధికారులు ముందుగా ఓట్లను కట్టలుగా విభజించి, లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతకు ముందు నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ, ఎన్నికల అబ్జర్వర్లు, అభ్యర్థులు, సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో నిబంధనల మేరకు స్ట్రాంగ్ రూమ్‌ల సీళ్లను తొలగించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ గదులకు తరలించారు.
కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మొత్తం 112 కౌంటింగ్ టేబుళ్లు
ఓట్ల లెక్కింపు కోసం 66 వార్డులకు సంబంధించి 77 టేబుళ్లు, మేయర్ ఎన్నికకు 35 టేబుళ్లు కలిపి మొత్తం 112 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మేయర్, కార్పొరేటర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు వేర్వేరుగా నిర్వహించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 600 మంది సూపర్వైజర్లు, 300 మంది సహాయక సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టడంతో పాటు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

