తిరుపతి కార్పొరేషన్ కౌంటింగ్ షురూ..!
- మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
- 2 గంటల నుంచి ఫలితాల వెల్లడి
- 477 పోస్టల్ బ్యాలెట్లు.. ఇప్పటికే 18 కట్టలుగా విభజన
- మేయర్ అభ్యర్థుల కోసం 35 టేబుళ్లు.. కార్పొరేటర్లకు 77 టేబుళ్లు
- ఐదు రౌండ్లలో కార్పొరేటర్ ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్ విధుల్లో 509 మంది సిబ్బంది
తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 477 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. వీటిని ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ల చొప్పున విభజించి సిబ్బంది ఇప్పటికే 18 కట్టలు సిద్ధం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మేయర్ అభ్యర్థులకు 35 టేబుళ్లు
మేయర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం 77 టేబుళ్లను సిద్ధం చేశారు. 5,000 ఓట్లకు పైగా ఉన్న 11 డివిజన్లలో రెండు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపును ఐదు రౌండ్లలో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. కౌంటింగ్ విధుల కోసం మొత్తం 509 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 121 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 363 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 25 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. వీరి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 2,90,492 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,36,031 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల్లో ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం డివిజన్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. మేయర్ అభ్యర్థి విజయం ఎవరిని వరించనుందనే అంశంపై నగరంలో ఆసక్తి నెలకొంది.
