Cotton Crop Damage- Pink Bollworm, Telangana Agriculture | ఎర్రబారిన తెల్ల బంగారం.. పత్తి రైతు విలవిల!
Cotton Crop Damage- Pink Bollworm, Telangana Agriculture | ఎర్రబారిన తెల్ల బంగారం.. పత్తి రైతు విలవిల!

- వేలాది ఎకరాల్లో ఎర్ర తెగులు ప్రభావంతో ఎండిపోతున్న పత్తి పంట
- పెట్టుబడి కూడా తిరిగి రాని దయనీయ పరిస్థితి
- పంటను తొలగించి మొక్కజొన్న, పెసర, మినుము సాగుకు సన్నద్ధం
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది సుమారు 5.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
- ఎర్ర తెగులు సోకిన పొలాల్లో ఎకరానికి 2–3 క్వింటాళ్ల దిగుబడి కూడా కష్టమే
- చీడపీడల నియంత్రణకు మందులు పిచికారీ చేసినా ఫలితం లేదంటున్న రైతులు
Cotton Crop Damage- Pink Bollworm, Telangana Agriculture | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో : వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, చీడపీడల దాడితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు సకాలంలో వర్షాలు లేక పంట ఎదుగుదల మందగించగా.. మరోవైపు ఎర్ర తెగులు, గులాబీ రంగు పురుగు పత్తి పంటను దెబ్బతీశాయి. దీంతో పత్తి మొక్కలు ఎర్రబారి ఆకులు రాలిపోయి, ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది. పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పత్తి పంటలో కాత, పూత సరిగా లేకపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు పూర్తిగా ఎండిపోతుండటంతో పత్తి ఏరే పరిస్థితి కూడా ఉండదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు భారీగా పెరిగినా.. కనీసం ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధారణంగా పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా ఏడు లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగవుతుండగా.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు విస్తీర్ణం సుమారు 5.5 లక్షల ఎకరాలకు పరిమితమైంది. దాదాపు 1.5 లక్షల ఎకరాల మేర పత్తి సాగు తగ్గింది.
వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు పలుమార్లు విత్తనాలు వేసుకోవాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడి భారం పెరిగింది. మొలకెత్తిన తర్వాత కూడా తగినంత తేమ అందక మొక్కలు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. బోర్లు, బావుల ద్వారా నీటి తడులు అందించిన రైతులకు కూడా పరిస్థితులు అనుకూలించలేదు.
అధిక ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి ఆధారిత రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుకు అర ఎకరం కూడా పూర్తిగా తడపలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు చెబుతున్నారు.
మొలిచినప్పటి నుంచే చీడపీడల దాడి

పత్తి రైతులకు ఈ సీజన్ ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు వర్షాభావంతో మొక్కలు సరిగా మొలకెత్తకపోగా.. మొలిచిన మొక్కలు కూడా ఏపుగా పెరగలేదు. దీనికి తోడు వివిధ రకాల చీడపీడలు పంటపై దాడి చేశాయి.
తెగుళ్ల నివారణ కోసం పలుమార్లు పురుగు మందులు పిచికారీ చేసినా ఆశించిన ఫలితం కనిపించలేదని రైతులు అంటున్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు వాడినా తెగుళ్లు అదుపులోకి రాలేదని వాపోతున్నారు. మందుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసినా పంట పరిస్థితి మాత్రం మెరుగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి పంట తొలగించి.. మొక్కజొన్న వైపు
ఎర్ర తెగులు, గులాబీ రంగు పురుగు ప్రభావంతో పత్తి చేలు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. పంటను అలాగే ఉంచితే మరింత నష్టం తప్పదని భావించి.. పత్తి మొక్కలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
బోర్లు, బావుల వంటి నీటి వసతి ఉన్న రైతులు పత్తి పంటను తొలగించి మొక్కజొన్న సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి వసతి లేని రైతులు మాత్రం పెసర, మినుము వంటి పంటల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పత్తి చేల తొలగింపు ప్రారంభమైంది.
రెండు.. మూడు క్వింటాళ్లు కూడా కష్టమే!
పత్తి పంటకు తెగుళ్లు, పురుగుల దాడి తీవ్రంగా ఉండటంతో ఈసారి దిగుబడులు భారీగా పడిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాధారంగా సాగు చేసిన పొలాల్లో ఎకరానికి రెండు, మూడు క్వింటాళ్ల పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.
నీటి వసతి ఉన్న రైతులు అదనపు నీటి తడులు అందించి దిగుబడిని పెంచుకోవాలని భావించినా.. తెగుళ్ల ప్రభావంతో ఆశించిన ఫలితం కనిపించడంలేదని అంటున్నారు. దీంతో ఎకరాకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల భారం పెరిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెల్లబంగారంపై ఆశలు.. ఎర్ర తెగులుతో ఆవేదన
పత్తిని తెల్లబంగారంగా భావించే ఉమ్మడి వరంగల్ రైతులకు ఈ సీజన్ చేదు అనుభవాన్ని మిగుల్చుతోంది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, చీడపీడల దాడి కలిసి పంటను దెబ్బతీయడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తక్షణమే రైతులకు నష్టపరిహారం అందించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన సహాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
