ఏడాది క్రితమే అవినీతి తీగలాగిన ఆంధ్రప్రభ

  • ఉన్నతాధికారులకు సామాజిక కార్యకర్తల ఫిర్యాదులు
  • స్పందన లేకపోవడంతో ఆంధ్రప్రభ అక్షర పోరాటం
  • ఎట్టకేలకు విచారణ
  • నిందితులను కాపాడేందుకు అధికారుల తంటాలు
  • మరోసారి ఆధారాలతో కూడిన ఫిర్యాదుల
  • అవినీతిపరులపై సస్పెన్షన్ వేటు వేసిన ఏపీ జెన్ కో ఎండీ

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా ఎన్టీటీపీఎస్ ఓసీసీ స్టోర్స్ కు చెందిన హెచ్పీ ఆటోకేర్ సెంటర్ లో జరిగిన భారీ అవినీతి, అక్రమాలకు బాధ్యులైన ఓసీసీ స్టోర్స్ పాలకవర్గ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లెన శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకట రమణలను సస్పెండ్ చేస్తూ ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.నాగలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీటీపీఎస్ హెచ్పీ ఆటోకేర్ సెంటర్ లో భారీ అవినీతి జరిగినట్లు 24 ఆగస్టు 2025న దోచుకో.. దాచుకో శీర్షికన ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.

అంతకు ముందే ఓసీసీ స్టోర్స్ పాలకవర్గంలోని కొంతమంది సభ్యులు అవినీతిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆంధ్రప్రభ ఆధారాలతో కూడిన వరుస కథనాలు ప్రచురించింది. అలాగే ఇబ్రహీంపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త నల్లమోతు ప్రసన్న బోస్, కొండపల్లికి చెందిన మరో సామాజిక కార్యకర్త కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విజయవాడ విభాగ సహకార శాఖ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు చేశారు. స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ ఓసీసీ స్టోర్స్ కు చెందిన హెచ్ పీ ఆటోకేర్ సెంటర్ లో అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని సహకార శాఖ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు సహకార శాఖ అధికారులు దాదాపు ఏడాది పాటు విచారణను కొనసాగించారు. ఈ విచారణ అనేక మలుపులు తిరగగా, విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రభ తన అక్షర పోరాటాన్ని కొనసాగించింది. 2023-26 కాలంలో పనితీరు, నిర్వహణలో తొమ్మిది అవకతవకలు బయటపడ్డాయి. హెచ్పీ ఆటోకేర్ సెంటర్ లో రూ.1,05,80,886.49 నిధులు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. నివేదికను విచారణ అధికారులు ఉన్నతాధికారులకు సమర్పించారు. హెచ్పీ ఆటోకేర్ సెంటర్ లో నిధులు దుర్వినియోగం చేసినట్లు బహిర్గతమైనా బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు కాలం వెళ్లదీశారు. ముఖ్యంగా ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్, ఏపీ జెన్ కో హెచ్ఆర్ డైరెక్టర్ అక్రమార్కులను కాపాడటానికి శాయశక్తులా కృషి చేశారు.

ఈ క్రమంలోనే ఈ అవినీతికి బాధ్యులైన ఓసీసీ స్టోర్స్ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లెన శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకట రమణలకు ఏపీ జెన్ కో యాజమాన్యం పదోన్నతులు కల్పించి ఆర్టీపీపీకి బదిలీ చేసింది. దీంతో సామాజిక కార్యకర్తలు పట్టు వదలని విక్రమార్కుల్లా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందేనని పలుమార్లు ఎన్టీటీపీఎస్, ఏపీ జెన్ కో, సహకార శాఖ అధికారులకు ఫిర్యాదుల ద్వారా పోరాటం చేశారు. ఈ నేపథ్యంలోనే సహకార శాఖ అధికారులు ఓసీసీ స్టోర్స్ పాలకవర్గాన్ని రద్దు చేశారు. అయితే అవినీతికి పాల్పడిన మాజీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లెన శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకట రమణలపై శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా ఏపీ జెన్ కో యాజమాన్యం తాత్సారం చేస్తోంది.

దీంతో సామాజిక కార్యకర్తలు ఇటీవల మరోసారి ఏపీ జెన్ కో ఎండీ నాగలక్ష్మి, ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ శివరామాంజనేయులుకు ఫిర్యాదు చేశారు. ఈ అవినీతి వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి విచారణ నివేదికలను పరిశీలించి మాజీ అధ్యక్ష, కార్యదర్శులు మల్లెన శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకట రమణలపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి పొందకుండా ఆర్టీపీపీని విడిచి వెళ్ళకూడదని, సస్పెన్షన్ కాలంలో వారి చిరునామా, సంప్రదింపు వివరాలను కూడా తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టఅలాగే సమర్థ అధికారికి అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇదిలా ఉంటే సస్పెన్షన్ కు గురైన మల్లెన శ్రీనివాసరావు, కొత్తపల్లి వెంకట రమణల నుంచి అవినీతి సొమ్మును రికవరీ చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు కోరుతున్నారు. అలాగే ఓసీసీ స్టోర్స్ లో పచారీ సరుకులకు సంబంధించి జరుగుతున్న అవినీతిపై కూడా ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.