Copilot-Axe-Attack-Flydubai-Flight : ఇది టెర్ర‌రే Andhra Prabha Top News

Copilot-Axe-Attack-Flydubai-Flight : ఇది టెర్ర‌రే Andhra Prabha Top News

  • కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై గొడ్డలితో దాడి
  • విమానం ఆధీనం కోసం ప్రయత్నం
  • ప్రయాణికుల ప్రతిఘటనతో తప్పిన పెను ప్రమాదం
  • యూఏఈ నిర్దార‌ణ

(దుబాయ్/టెల్ అవీవ్, ఆంధ్రప్రభ ప్రతినిధి):

ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతో కో-పైలట్ కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై గొడ్డలితో దాడి చేసి, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రాసిక్యూటర్ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ వెల్లడించారు. ఈ ఘటనను ‘ఉగ్రవాద దాడి ప్రయత్నం’గా దర్యాప్తులో గుర్తించినట్లు ఆయన తెలిపారు.

ఫ్లైదుబాయ్‌కు చెందిన FZ1073 విమానం యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తుండగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 170 మందికి పైగా ఉన్నారు. కాక్‌పిట్‌లో కో-పైలట్ కెప్టెన్‌పై దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. అయితే ప్రయాణికులు, సిబ్బంది కలిసి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంతో పెను విపత్తు తప్పింది.

కో-పైలట్ ఎవరంటే..?

దాడికి పాల్పడిన కో-పైలట్‌ను హమ్మామ్ అల్-హమ్మామీగా గుర్తించినట్లు ఈ వ్యవహారంపై ప్రత్యక్ష సమాచారం ఉన్న ఓ వర్గం రాయిటర్స్‌కు తెలిపింది. అతడు ఒమన్‌కు చెందిన జాతీయుడని వెల్లడించింది. మరో దర్యాప్తు వర్గం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. అయితే యూఏఈ అధికారులు మాత్రం ఇప్పటివరకు అతడి గుర్తింపును అధికారికంగా వెల్లడించలేదు.

కాక్‌పిట్‌లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే క్రాష్ యాక్స్‌ (గొడ్డలి)తో కో-పైలట్ కెప్టెన్‌పై దాడి చేసినట్లు యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ తెలిపారు. అనంతరం విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.

సౌదీలో అత్యవసర ల్యాండింగ్

కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న ఘటనతో విమానాన్ని దారి మళ్లించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ఫ్లైదుబాయ్ రిజర్వ్ పైలట్ నియంత్రణ చేపట్టి, విమానాన్ని సౌదీ అరేబియాలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అక్కడ సౌదీ అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం అతడిని సౌదీ అరేబియా నుంచి అబుదాబికి తరలించారు.

ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఇజ్రాయెలీలు

ఈ విమానంలోని ప్రయాణికుల్లో అత్యధికులు ఇజ్రాయెల్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లే ఈ విమాన మార్గాన్ని ఇజ్రాయెల్ ప్రయాణికులు తరచూ వినియోగిస్తుంటారు.విమాన ప్రయాణంలో సుమారు 30 సెకన్ల వ్యవధిలోనే విమానం 16,625 అడుగుల మేర ఎత్తు కోల్పోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ Flightradar24 డేటా వెల్లడించింది. అయితే ఈ ఎత్తు తగ్గడానికి కాక్‌పిట్‌లో జరిగిన ఘటన ఎంతవరకు కారణమన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

దర్యాప్తు కొనసాగుతోంది

ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తును యూఏఈ అధికారులు చేపట్టారు. కో-పైలట్ ఉద్దేశం ఏమిటి? అతడు ఎవరి ప్రేరణతోనైనా ఈ దాడికి పాల్పడ్డాడా? ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
అవసరమైన దర్యాప్తు ప్రక్రియలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తాం’ అని యూఏఈ ప్రాసిక్యూటర్ జనరల్ తెలిపారు. ఫ్లైదుబాయ్ సంస్థ కూడా ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రస్తుతం మరిన్ని వివరాలు వెల్లడించే పరిస్థితిలో తాము లేమని తెలిపింది.

ఇజ్రాయెల్ దర్యాప్తు అధికారులు కూడా..

యూఏఈ నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తులో ఇజ్రాయెల్ అధికారులు కూడా పాల్గొననున్నట్లు ఓ ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారి తెలిపారు. కో-పైలట్‌ను ఇజ్రాయెల్ దర్యాప్తు అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని గతంలో సమాచారం వెలువడింది.
ఒమన్‌తో ఇజ్రాయెల్‌కు అధికారిక దౌత్య సంబంధాలు లేవు. ఒమన్ వంటి దేశాలకు చెందిన పైలట్లను ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాలను నడిపేందుకు అనుమతించరాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో పేర్కొన్నారు. అలాంటప్పుడు ఒమన్ జాతీయుడైన కో-పైలట్ ఈ విమానానికి ఎలా కేటాయించబడ్డాడన్నది కూడా ప్రశ్నగా మారింది.

‘ఎవరి ఆదేశాలతో చేశాడో తేలాలి’

ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? అన్నదానిపై కూడా ఇజ్రాయెల్ దర్యాప్తు చేస్తోంది. కో-పైలట్ ఎవరి ఆదేశాలతోనైనా వ్యవహరించాడా? అన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారెవరైనా ఉంటే ‘భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.యూఏఈ అధ్యక్షుడి సీనియర్ సలహాదారు అన్వర్ గర్గాష్ కూడా ఉగ్రవాదంపై తమ దేశానికి ‘జీరో టాలరెన్స్’ విధానం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కో-పైలట్ దాడికి గల ఖచ్చితమైన కారణం, ఉద్దేశం, ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.