ఒక గురువు తన ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న శిష్యులను ఉద్దేశించి ”ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయం మీరు అడిగే ప్రశ్నలకు నా సమాధానాలు అనగా ఒక శిష్యుడు లేచి ”ఈ లోకంలో సంతోషంగా జీవించేవారు ఎవరు గురువర్యా?” అని అడుగగా ”ఈ లోకంలో కోరికలను జయించిన వాడే సంతోషంగా జీవించగలడు మనిషిలోని బాధలకు అసలు కారణం ఆచరణ సాధ్యం కాని కోరికలు. నీవు నీలా బతుకుతున్నప్పుడు లేని బాధ ఇతరులతో పోల్చుకుని చూసినప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఈ భూమి మీద కోరికలు లేని మనిషి అనే వాడు ఉండడు అంటే అతిశయోక్తి కానే కాదు! కోరికలు అనేవి ప్రతి వ్యక్తికి ఉండాలి అవి మనిషి జీవన కొనసాగింపుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి కోరికలు తీరిన మనిషి ఆనందంతో జీవిస్తాడు తను సంతృప్తి చెందడం వల్ల ఇతరులకు సహాయం చేయాలని ఆలోచన కలుగుతుంది. కోరికలు అపరిమితమైనవి, బాల్యం, యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం ఇలా ప్రతి దశలోనూ అవి ఉదయిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గుర్తించాలి అదేంటంటే మన కోరికలు మనల్ని ముందుకు తీసుకు వెళ్లే విధంగా, వాటిని మనం సాధించే విధంగా ఉండాలి వాటి సాధనకై ప్రయత్న లోపం లేకుండా కష్టపడాలి అప్పుడే అవి తీరుతాయి. విచక్షణ కోల్పోయి సాధ్యాసాధ్యాలను పక్కనపెట్టి తీరని కోరికలకు మనసులో స్థానం కల్పిస్తే అవి తీరకపోతే జీవితం మీద నిరాశక్తత, మానసిక అశాంతి, తీవ్ర నైరాస్యం ఆవ#హంచే అవకాశం ఉంది అది వ్యక్తికి, అతని కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది కాదు కనుక ప్రతి వ్యక్తి కోర్కెలపై నియంత్రణ కలిగి ఉండాలి. కోరికలు సాధించగలిగేవా? లేవా? అని బేరీజు వేసుకొని సాధించగలము అనే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. ఎంత ప్రయత్నించినా మనకు సాధ్యం కానీ కోరికలను త్యజించటం ఎంతో అవసరం మరియు ఉత్తమం కూడా అప్పుడే సంతోషంగా జీవించడం సాధ్యం అవుతుంది” అని వివరించారు గురువుగారు.
- ఏడుకొండలు కళ్ళేపల్లి