కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్ల నిర్మాణం రద్దు..
- అధికారిక జీవో జారీ..
- వన్‌వే విధానంతోనే ట్రాఫిక్ నియంత్రణకు నిర్ణయం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణానికి బ్రేక్ పడింది. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాలని భావించిన ఈ పనులను జీహెచ్‌ఎంసీ అధికారికంగా రద్దు చేసింది. పాత ప్రతిపాదన ప్రకారం సుమారు రూ.1,090 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ఒప్పందాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయోగాత్మకంగా అమలు చేసిన వన్‌వే ట్రాఫిక్ విధానం సత్ఫలితాలు ఇచ్చిందని అధికారులు గుర్తించారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తగ్గాయని భావించిన ప్రభుత్వం.. ప్రస్తుతం అమల్లో ఉన్న వన్‌వే విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లతో కూడిన పాత ప్రణాళికను పక్కన పెట్టింది.
అయితే ఏడు ఫ్లైఓవర్లకు బదులుగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే చేపట్టిన ప్రాథమిక పనుల్లో భాగంగా తవ్విన గుంతలను పూడ్చివేయడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. అయితే తొలి దశ పనుల కోసం చెట్ల తొలగింపు, ప్రజాధనం ఖర్చు చేసిన అంశాలపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
