Congress dappula motha Erravalli | రణరంగంగా ‘ఎర్రవల్లి’!

  • కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించిన కాంగ్రెస్‌
  • అధికార పార్టీ కార్యకర్తల డప్పుల మోత
  • బారికేడ్లు తోసుకుని దూసుకెళ్లిన కాంగ్రెస్‌
  • ఇరు వర్గాలు, శ్రేణుల మధ్య తోపులాట
  • భారీగా మోహరించిన పోలీసు బలగాలు
  • బారికేడ్లు, రోప్‌ పార్టీలతో కట్టు-దిట్టమైన భద్రత
  • తోసుకుని దూసుకెళ్లిన కాంగ్రెస్‌ శ్రేణులు
  • బొల్లారం వద్ద కేటీ-ఆర్‌, హరీశ్‌రావుల నిర్బంధం
  • మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ రైతు దీక్ష..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి గ్రామ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తతలకు వేదికయ్యాయి. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం (ఫామ్‌హౌస్‌) ముట్టడికి కాంగ్రెస్‌ పార్టీ డప్పుల మోత పేరుతో పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ శ్రేణులు డప్పుల మోతతో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ ముట్టడికి యత్నించడంతో తమ అధినేతను పరామర్శించేందుకు, ఆయనకు స్వయంగా రక్షణగా నిలిచేందుకు అసెంబ్లీ నుంచి బయల్దేరిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ-ఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు హకీంపేట వద్ద అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. అంతకు ముందుగానే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వద్ద కాంగ్రెస్‌ డప్పుల మోత నిరసన, బారికేడ్ల ధ్వంసం లాంటి కార్యక్రమాలు ఘటనలు చోటుచేసుకున్నాయి.

మరోవైపు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం భారీగా మోహరించడంతో ఎర్రవల్లి రణరంగాన్ని తలపించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం భారీగా మోహరించి బారికేడ్లు, రోప్‌ పార్టీలతో కట్టు-దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నర్సారెడ్డి ఆధ్వర్యంలో వరదరాజపూర్‌ మీదుగా భారీగా చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. బారికేడ్లను తోసుకుని కొందరు కార్యకర్తలు ఫామ్‌హౌస్‌కు దాదాపు అర కిలోమీటరు సమీపంలోకి వెళ్లి డప్పులు మోగిస్తూ నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి బారికేడ్లను తోసుకుని నేరుగా ఫామ్‌హౌస్‌ వైపు పరుగు తీయడంతో పోలీసులు ఆమెను అడ్డుకుని వెనక్కి పంపారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పలువురు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.

మరోవైపు మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా మోహరించాయి. ఫామ్‌హౌస్‌ సమీపంలో రైతు దీక్ష పేరుతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎదురు నిరసనకు దిగడంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫామ్‌హౌస్‌ వద్ద ఉద్రిక్తతల సమాచారం అందుకున్న వెంటనే శాసనసభ సమావేశాల నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ-ఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పార్టీ ఎమ్మెల్యేలు నేరుగా ఎర్రవల్లికి వాహనాల్లో బయల్దేరారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బొల్లారం, హకీంపేట చెక్‌పోస్టుల వద్ద వారి కాన్వాయ్‌లను నిలిపివేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు-చేసుకుంది. పోలీసులు వాహనాలను అనుమతించకపోవడంతో కేటీ-ఆర్‌, హరీశ్‌రావు ఇతర నేతలతో కలిసి బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవల్లి వైపునకు పాదయాత్రగా బయల్దేరారు. ప్రభుత్వమే పోలీసుల అండతో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉసిగొల్పి దాడులకు పురిగొల్పుతోందని, ప్రతిపక్ష నేతలకు స్వేచ్ఛ లేకుండా చేస్తోందని ఈ సందర్భంగా వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉదయం నుంచి ఎర్రవల్లి, మర్కుక్‌, బొల్లారం పరిసర ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ఫామ్‌ హౌస్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. అడ్డుకున్న పోలీసులు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌కు బయలుదేరారు. కేసీఆర్‌ను కలవనున్నారు. కేటీ-ఆర్‌, హరీశ్‌ రావులతో పాటు- బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరూ ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ పిలుపు నివ్వడంతో వీరంతా అక్కడకు బయలుదేరి వెళ్లారు. నిన్నటి ఘటనపై ఎమ్మెల్సీలు మాత్రం శాసనమండలిలోనే ఉండాలని ఇప్పటికే విప్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ను కలిసి నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటన గురించి, తర్వాత జరిగిన పరిణామాలు, పోలీసుల అరెస్ట్‌లు, కేసులపై కేసీఆర్‌తో చర్చించేందుకు వెళుతున్నామని ఆ పార్టీ నేతలు తెలిపారు. అయితే, మధ్యలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

నా నాయకుడిని కాపాడుకుంటాం : కేటీఆర్‌

ఫామ్‌హౌస్‌ వద్ద వందలాది మంది పోలీసు బలగాలను మోహరించామని అధికారులు చెబుతున్నప్పటికీ, తమ నాయకుడి భద్రత విషయంలో ప్రభుత్వ పోలీసులపై తమకు ఎంతమాత్రం నమ్మకం లేదని బీఆర్‌శ్రీస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ-ఆర్‌ వ్యాఖ్యానించారు. ‘మా నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.. అందుకే మేమే స్వయంగా బయలుదేరాం’ అని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీ-ఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అత్యంత తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు గుప్పించారు. ఎర్రవల్లి ముట్టడి పేరుతో కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్‌పై కుట్రపూరితంగా హత్యాయత్నానికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ అర కిలోమీటరు సమీపం వరకు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు ఎలా అనుమతించారని కేటీ-ఆర్‌ నిలదీశారు. తమ సొంత పార్టీ నాయకుడి నివాసానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడుగడుగునా ఎందుకు నిర్బంధిస్తున్నారో రాష్ట్ర డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.