నందికొట్కూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ గురి!
- 32 వార్డుల్లో గెలుపే లక్ష్యం..
- శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలి
- నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం..
- జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ పిలుపు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: రానున్న నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తేనే నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
32 వార్డుల్లో విజయం సాధించాలి
ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. నందికొట్కూరు మున్సిపాలిటీలోని 32 వార్డులతో పాటు చైర్పర్సన్ పదవిని సైతం కైవసం చేసుకోవడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై కాంగ్రెస్ విధానాలను వివరించాలని సూచించారు. అంతర్గత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
టీడీపీ, వైసీపీలపై విమర్శలు
టీడీపీ, వైసీపీలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని లక్ష్మీ నరసింహ యాదవ్ విమర్శించారు. బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఆ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, ఆ తర్వాత ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్రజల విశ్వాసం ఉందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తన బలాన్ని నిరూపించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి కృషి
నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ వద్ద స్పష్టమైన కార్యాచరణ ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు అవకాశం కల్పిస్తే పట్టణంలో పారిశుధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దీర్ఘకాలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పార్టీ అభ్యర్థులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇంటింటి ప్రచారం ద్వారా కాంగ్రెస్ విధానాలను వివరించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ, పట్టణ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

