హామీల అమలులో కాంగ్రెస్ విఫలం..

వెయ్యి రోజులు దాటిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు..
మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆరోపణ

వికారాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు దాటిన ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేదని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. కోటిపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు అనిల్ సుందరి నేతృత్వంలో నిర్వహించిన ఊరేగింపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేవలం పదవులు కాపాడుకోవడం కోసం మంత్రులు ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.. ముఖ్యమంత్రి సీటు ఉంటుందో.. ఊడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు.

జిల్లా నుండి ముఖ్యమంత్రి, స్పీకర్ ఉన్నా… ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని ఆయన ఆరోపించారు. గతంలో బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుతం కనిపిస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మంజుల శ్రీశైలం రెడ్డి మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధి చెందింది అంటే కేవలం బీఆర్ఎస్ వల్లనే అని.. కోటిపల్లి మండలంలో బీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేష్ యాదవ్, కొండల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.