సీఎం రేవంత్‌పై చేసిన కేసు పెట్టాలన్న కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన మల్లు రవి
బీఎన్‌ఎస్ సెక్షన్లు 356, 352 కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి
సోషల్ మీడియా, మీడియా ప్రచారానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలు భద్రపరచాలని కోరిన ఎంపీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా, అవమానకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు అందజేశారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని మల్లు రవి ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులపై రాజకీయ విమర్శలు చేయడంలో అభ్యంతరం లేకపోయినా.. వ్యక్తిగతంగా అవమానించేలా, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా పరిశీలించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 356, 352 కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను మల్లు రవి కోరారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన ప్రసంగాలు, వీడియోలు, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను సేకరించి భద్రపరచాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారమైన సంబంధిత వీడియోలు, పోస్టులు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించి.. వ్యాఖ్యల పూర్తి సందర్భాన్ని నిర్ధారించాలని మల్లు రవి కోరారు. ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం దర్యాప్తు జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
