కాంగ్రెస్‌ అంటేనే రౌడీ రాజ్యం..

  • కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలపై దాడి హేయమైన చర్య: మేడే రాజీవ్‌ సాగర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్‌పై పోలీసుల సమక్షంలో సుమారు 15 మంది దాడి చేయడం దారుణమైన, అమానవీయ చర్య అని మండిపడ్డారు.

రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేసి, పండుగ రోజున విచారణ పేరుతో పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారని ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌ వంటి భద్రత కలిగిన ప్రదేశంలోకి ఇంతమంది వ్యక్తులు ప్రవేశించి దాడి చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మహేష్‌, మహేందర్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడటం రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని రాజీవ్‌ సాగర్‌ అన్నారు. విచారణకు పిలిపించి చీకటి పడే వరకు పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచడం వెనుక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

పోలీస్‌ స్టేషన్‌లో దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి హోదాల్లో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.