ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళన
- రామగుండం కార్పొరేషన్ ముందు బైఠాయింపు
- ఇన్చార్జి కమిషనర్ దురుసుగా ప్రవర్తిస్తుందంటూ ఆగ్రహం
గోదావరిఖని, (ఆంధ్రప్రభ) : పెద్దపల్లి జిల్లా రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్‌కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
