హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన రామయ్య లక్ష్యం మహోన్నతమైందన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని ఉద్యమనేత కేసీఆర్ కొనియాడారు. ప్రపంచ పర్యావరణం కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని అన్నారు.
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు . ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య .. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం. వారి మరణం సమాజానికి తీరని లోటు అంటూ వనజీవీ కుటుంబ సభ్యులకు రేవంత్ తన తీవ్ర సంతాపం తెలియజేసారు .
ఉప ముఖ్యమంత్రి భట్టి సంతాపం..
వనజీవి రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రుల సంతాపం..
కోటి మొక్కల ప్రధాత మృతి ప్రకృతి ప్రేమికులకు తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వనజీవి మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్ వద్దిరాజు రవిచంద్రం సంతాపం వ్యక్తంచేశారు. పద్మశ్రీ వనజీవి రామయ్యను కోల్పోవడం చాలా బాధాకరమని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన ప్రకృతి యోధుడని చెప్పారు. రామయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రకృతి ప్రేమికుడు.. హరిత స్వాప్నికుడు..
వనజీవి మృతిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం తెలిపారు. ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి, మొక్కలను బిడ్డలవలే పెంచారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు. పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు. వారి జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి. అలాంటి గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.