ప్రీ-ప్రింటెడ్‌ ఫారం-7లపై పోలీసులకు ఫిర్యాదు

  • మూడు నియోజకవర్గాల్లో ఒకే తరహా ఘటన…
  • సమగ్ర దర్యాప్తు చేయాలి..
  • ఎస్‌ఐటీ ఏర్పాటు చేయాలని డిమాండ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు, ఇతర అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రీ-ప్రింటెడ్‌, ప్రీ-ఫిల్‌ చేసిన ఫారం-7 దరఖాస్తులను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజేష్‌ కుమార్‌ హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆయనతో పాటు కమిటీ సభ్యులు వాజీద్‌ హుస్సేన్‌, ఎస్‌ఐఆర్‌ కో-ఆర్డినేటర్‌ గంప వేణుగోపాల్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఖాలిద్‌ సైఫుల్లాహ్‌, దీపక్‌ జాన్‌, మోత రోహిత్‌ తదితరులు ఫిర్యాదు సమర్పించారు. ఈ వ్యవహారంపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్‌ఐటీ) ఏర్పాటు చేయాలని రాజేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 210కు చెందిన బీజేపీ బూత్‌ లెవల్‌ ఏజెంట్‌గా పేర్కొంటున్న శివేగి బాలచందర్‌ అలియాస్‌ బాలు.. కాంగ్రెస్‌ బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ షార్ఫుద్దీన్‌, ఆయన కుటుంబంలోని సుమారు 31 మంది సభ్యుల పేర్లపై ఫారం-7 దరఖాస్తులు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ దరఖాస్తులు ముందుగానే ప్రీ-ప్రింట్‌, ప్రీ-ఫిల్‌ చేసి సిద్ధం చేసినట్లు కనిపించడం అనుమానాలకు తావిస్తోందని రాజేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు నిజంగానే దరఖాస్తులు సమర్పించారా? వాటిపై సంతకాలు చేశారా? వారి అనుమతి లేదా సమ్మతి ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేయాలని కోరారు.

మూడు నియోజకవర్గాల్లో ఒకే తరహా ఘటనలు

ముషీరాబాద్‌తో పాటు బహదూర్‌పురా, గోషామహల్‌ నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా ఫారం-7 దరఖాస్తులు వెలుగులోకి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బహదూర్‌పురా నియోజకవర్గంలో అక్టోబర్‌ 1న ప్రీ-ప్రింటెడ్‌ ఫారం-7 దరఖాస్తులు గుర్తించినట్లు తెలిపారు.

గోషామహల్‌ నియోజకవర్గంలో అక్టోబర్‌ 3న సుమారు 15 దరఖాస్తులను పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 173కు చెందిన బూత్‌ లెవల్‌ అధికారికి అందజేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. అయితే వాటిపై సంబంధిత దరఖాస్తుదారుల సంతకాలు లేకపోవడంతో పాటు పెద్ద సంఖ్యలో ఒకేసారి దరఖాస్తులు రావడంతో అధికారి వాటిని స్వీకరించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తక్కువ వ్యవధిలో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే తరహా ప్రీ-ఫిల్‌ చేసిన ఫారం-7లు వెలుగులోకి రావడం వెనుక ఒకే మూలం, ఒకే నమూనా, ఒకే డేటాబేస్‌ లేదా సమన్వయంతో పనిచేసే నెట్‌వర్క్‌ ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రాజేష్‌ కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ఓటర్ల ఎన్నికల వివరాలను సేకరించి.. వారి అనుమతి లేకుండా ఫారం-7లను సిద్ధం చేశారా అనే విషయాన్ని కూడా తేల్చాలని కోరారు.

ఎక్కడ తయారు చేశారు? ఎవరి ఆదేశాలతో సమర్పించారు?

ప్రీ-ప్రింటెడ్‌ దరఖాస్తులను ఎవరు తయారు చేశారు? ఎక్కడ ముద్రించారు? ఎవరికి పంపిణీ చేశారు? ఎవరి ఆదేశాల మేరకు వాటిని బూత్‌ లెవల్‌ అధికారులకు సమర్పించారు? దరఖాస్తుల్లోని వ్యక్తిగత ఎన్నికల సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో కోరారు. ఇందుకోసం పత్రాలు, డిజిటల్‌ ఆధారాలు, ఫోరెన్సిక్‌ సాక్ష్యాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పరిశీలించాలని సూచించారు.

తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో ప్రీ-ప్రింటెడ్‌ ఫారం-7 దరఖాస్తులు సిద్ధం చేసి అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లకు, అనంతరం స్థానిక బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు అందించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని రాజేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తులో తేల్చాలని కోరారు. దర్యాప్తును కేవలం స్థానిక బూత్‌ లెవల్‌ ఏజెంట్లకే పరిమితం చేయకుండా ఫారాలను ఎవరు తయారు చేశారు, ఎవరు ముద్రించారు, ఎవరు ఆదేశించారు, ఎవరు పంపిణీ చేశారు, ఎవరు సమన్వయం చేశారు, ఎవరైనా ఆర్థికంగా లేదా సంస్థాగతంగా సహకరించారా అనే అంశాల వరకు విస్తరించాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌ రావు పాత్రపైనా దర్యాప్తు జరపాలని రాజేష్‌ కుమార్‌ కోరారు. ఈ వ్యవహారం గురించి ఆయనకు ముందస్తు సమాచారం ఉందా? ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? ఈ కార్యకలాపాలకు సహకారం అందించారా? అనే అంశాలను ఆధారాల ఆధారంగా విచారించాలని అన్నారు. రాజకీయ హోదా లేదా పార్టీ పదవితో సంబంధం లేకుండా దర్యాప్తులో ఎవరైనా నేరపూరిత బాధ్యత వహించినట్లు తేలితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఎస్‌ఐటీ ఏర్పాటు చేయాలి

ఈ ఘటనలను సాధారణ ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలుగా చూడకూడదని, నిజమైన ఓటర్ల పేర్లను అక్రమంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరిగి ఉంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని రాజేష్‌ కుమార్‌ అన్నారు. ముషీరాబాద్‌, బహదూర్‌పురా, గోషామహల్‌ ఘటనలను పరస్పరం అనుసంధానించి దర్యాప్తు చేయాలని కోరారు. వివాదాస్పద ఫారం-7ల అసలు కాపీలను స్వాధీనం చేసుకుని భద్రపరచడంతో పాటు సంతకాలు, చేతిరాత, ప్రింటింగ్‌ వివరాలు, పత్రాల మూలాలను ఫోరెన్సిక్‌గా పరిశీలించాలని సూచించారు.

సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారులు, ఏఈఆర్‌ఓలు, ఈఆర్‌ఓల వద్ద ఉన్న రికార్డులను భద్రపరచాలని, సీసీటీవీ ఫుటేజీ, డిజిటల్‌ కమ్యూనికేషన్లు, ప్రింటింగ్‌ రికార్డులు, చట్టపరంగా పొందగలిగే ఇతర ఆధారాలను సేకరించాలని కోరారు. సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఫారం-7 దరఖాస్తులు సమర్పించబడ్డాయా? అనే అంశాన్ని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారం వెనుక విస్తృతమైన వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ ఉందా అనే విషయాన్ని వెలికితీయాలని కోరారు.

నిజమని తేలితే చట్టపరమైన చర్యలు

దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుడు ప్రకటనలు చేయడం, నకిలీ పత్రాల తయారీ లేదా వినియోగం, మోసం, కుట్ర, వ్యక్తి పేరును దుర్వినియోగం చేయడం లేదా ఎన్నికల హక్కులను అక్రమంగా ప్రభావితం చేయడం వంటి నేరాలకు వర్తించే చట్టాల కింద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజేష్‌ కుమార్‌ కోరారు. ఫారం-7లో తప్పుడు ప్రకటనలకు సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను, దర్యాప్తులో వాస్తవాలు నిర్ధారించిన మేరకు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అర్హత కలిగిన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండటం ప్రజాస్వామ్య హక్కు అని రాజేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. తప్పుడు దరఖాస్తులు, నకిలీ ప్రకటనలు లేదా వ్యక్తుల అనుమతి లేకుండా సిద్ధం చేసిన పత్రాల ద్వారా నిజమైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నం జరిగితే అది వ్యక్తిగత హక్కుపైనే కాకుండా ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థపైనా దాడి అవుతుందని అన్నారు.

ముషీరాబాద్‌, బహదూర్‌పురా, గోషామహల్‌లో వెలుగులోకి వచ్చిన ఘటనలు పరస్పరం సంబంధం లేనివా? లేక సమన్వయంతో జరుగుతున్న చర్యలో భాగమా? అన్నది పోలీసులు తేల్చాలని కోరారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఎస్‌ఐటీ ఏర్పాటు చేసి సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి అసలు సూత్రధారులను వెలుగులోకి తీసుకురావాలని పులిపాటి రాజేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.