మహిళా ఎమ్మెల్యేలపై దాడిపై ఫిర్యాదు

అసెంబ్లీ ప్రాంగణంలో తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణ
జుట్టు పట్టి లాగడం, అవమానించడం, హక్కులకు విఘాతం కలిగించారంటూ ఫిర్యాదు
సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ, స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఘటనలపై బీఆర్‌ఎస్‌ జాతీయ స్థాయిలో పోరాటాన్ని ముమ్మరం చేసింది. అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్‌ నేతల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC)ను ఆశ్రయించింది. కమిషన్‌ సభ్యురాలు, తాత్కాలిక చైర్‌పర్సన్‌ విజయ భారతి సయానీని కలిసి ఘటనపై ఫిర్యాదు సమర్పించింది.

బీఆర్‌ఎస్‌ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు కమిషన్‌ సభ్యురాలిని కలిసి తమ వాదనలను వివరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో తమపై పోలీసులు వ్యవహరించిన తీరుతో పాటు, శాసనసభ్యులుగా తమకున్న హక్కులకు విఘాతం కలిగించారని ఆరోపించారు.

‘అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు’

మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అవమానించారని, అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా జుట్టు పట్టుకుని లాగడం వంటి అమానుష చర్యలకు పోలీసులు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలచే ఎన్నికైన శాసనసభ్యులను సభకు హాజరు కాకుండా అడ్డుకోవడం వారి హక్కులను కాలరాయడమేనని కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

సీఎం, డీజీపీ, స్పీకర్‌పై ఫిర్యాదు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పోలీసుల ద్వారా తమపై దాడులు చేయించిందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ, అసెంబ్లీ స్పీకర్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కోరారు.

జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన అంశాన్ని బీఆర్‌ఎస్‌ బృందం జాతీయ మహిళా కమిషన్‌ (NCW) దృష్టికి కూడా తీసుకెళ్లింది. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగినట్లు ఆరోపిస్తున్న అవమానకర ఘటనలపై నివేదికను కమిషన్‌కు అందజేసింది.

అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే తీవ్ర విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల, మహిళా హక్కుల సంస్థల దృష్టికి తీసుకెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.