ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి

రైతులను తక్షణమే ఆదుకోవాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ డిమాండ్‌
బెజ్జంకి, ఆంధ్రప్రభ:
కరువు పరిస్థితులు, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు.

బుధవారం సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ ఆధ్వర్యంలో ముత్తన్నపేట స్టేజి సమీపంలోని ఎండిపోయిన వరి పొలాలను పార్టీ నాయకులతో కలిసి మంద పవన్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పెట్టుబడులు, ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు, పంట చేతికొచ్చే సమయంలో సాగునీటి కొరతతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని, బాధిత రైతులకు పరిహారం అందించాలని కోరారు. తదుపరి పంట సాగుకు ఆర్థిక సహాయం, రుణ వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.