కలెక్టర్ కీలక ఆదేశాలు !!
మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు విజయవాడ నగరంలో అన్ని వ్యాపార సంస్థలు, షాపులు మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ షాపులు, పాలు, కూరగాయల దుకాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆయన ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గాలులు వేగంగా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు రేపటి రోజంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ !!
ఇక మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
తీరప్రాంతంలోని అన్ని ఓడరేవులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విద్యార్థుల భద్రత దృష్ట్యా మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం విజ్ఞప్తి చేసింది. కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల భాగంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) దళాలను ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మోహరించింది. ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

