• నిత్యం అలెర్ట్ పై ఆదేశాలు
  • గ్రామంలో వీధి వీధిలో పర్యటన
  • గ్రామస్తులకు దైర్యం
  • సాధారణ స్థితికి తురకపాలెం


(గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తురకపాలెం (Turakapalem) లో బుధవారం పర్యటించారు. గ్రామంలో గల రెండు తాగు నీటి పథకాలు నుండి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. గ్రామంలో పర్యటించి పారిశుధ్య పరిస్థితి పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీసారు. జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. సరఫరా చేస్తున్న నీరు అవసరాలకు సరిపోతుందా అని అడిగారు. నీటిపై మూతలు పెట్టాలని ఆమె కోరారు. అనారోగ్య పరిస్థితులు తలెత్తితే తక్షణం వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు.

దగ్గరలో పెద్ద పలకలూరు (Pedda palakaluru) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని అచ్చట వైద్య సేవలు పొందవచ్చని సూచించారు. మరగ కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆమె సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. అవగాహన పటిష్టంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి చిన్న అంశాన్ని కూడా అర్ధం అయ్యే విధంగా తెలియజేయాలని అన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. వైద్య పరీక్షల వివరాలు తక్షణం గ్రామస్తులకు అందించాలని ఆమె ఆదేశించారు.

తురకపాలెం కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి (Vijayalakshmi), ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి. రమణ వివరించారు. గ్రామంలో 2,500 జనాభా ఉన్నారని, 18 సంవత్సరాలు వయస్సు దాటిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించామని వివరించారు. తాగునీటి సరఫరా పై గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కళ్యాణ చక్రవర్తి వివరించారు.

గ్రామస్తులు మాట్లాడుతూ జూన్, జూలై నెలలలో తాగు నీటి కొరత వస్తుందని, శాశ్వత పరిష్కారం కోసం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (Guntur Municipal Corporation) నుండి తాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో రెండు, మూడు వందల లోతులో బోర్లు వేయాల్సి వస్తుందని, ప్రైవేట్ వ్యక్తులు ఐదు వందల లోతు వరకు వెళుతున్నారని వివరించారు. గ్రామంలో బోర్లు వేస్తున్న పూడుకు పోతున్నాయని చెప్పారు. మాన్ హోల్స్ వద్ద ఇంకా పటిష్టంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply