లబ్ధిదారుల ఇంటికే భరోసా..
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులతో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాటామంతీ
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం జగరాజుపల్లి ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి నెలా పింఛన్ సకాలంలో అందుతోందా? పంపిణీలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హుల చెంతకు చేరడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
జగరాజుపల్లి ఎస్సీ కాలనీలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు అందజేశారు. సత్తెనగారి సత్యమ్మకు దివ్యాంగుల పింఛన్ కింద రూ.6 వేలు, మాదిగ నారాయణకు వృద్ధాప్య పింఛన్ కింద రూ.4 వేలు, మాదిగ బావక్కకు రూ.4 వేల వృద్ధాప్య పింఛన్, హరిజన రామక్కకు రూ.6 వేల దివ్యాంగుల పింఛన్ నగదును అందించారు. పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వేగంగా పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పంపిణీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా, ప్రతి అర్హుడికి నిర్ణీత సమయంలో పింఛన్ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పథకం అమలులో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, మెప్మా పీడీ నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
