పాఠశాలల మౌలిక వసతుల పనులపై కలెక్టర్ సమీక్ష
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పనుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి హెచ్చరించారు. ‘మన బడి – మన భవిష్యత్తు’ కార్యక్రమం పనుల పురోగతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పూర్తయిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫోటోలతో సహా వెంటనే పోర్టల్‌లో అప్‌డేట్ చేసి క్లోజ్ చేయాలని ఆదేశించారు.
ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రతి పాఠశాలను సందర్శించి హెచ్‌ఎంలతో సమన్వయం చేసుకోవాలని, డీఈఓ, ఎంఈఓలు మండలాల వారీగా పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. టాయిలెట్లు, తాగునీరు, విద్యుదీకరణ, ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్‌లు, పెయింటింగ్ తదితర పనుల్లో పెండింగ్ లేకుండా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
