జోడేఘాట్‌లో ఈ నెల 26న కొమురం భీం వర్ధంతి

  • పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.. అధికారులకు కలెక్టర్‌ హరిత ఆదేశం

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధుడు కొమరం భీమ్ 86 వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా ఈనెల 26న నిర్వహించనున్నట్టు ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కలెక్టర్ కె హరిత వెల్లడించారు. ఈ మేరకు కొమరం భీమ్ పోరుగడ్డ జోడేఘాట్‌లో వర్ధంతి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె. హరిత, ఐటీడీఏ పీఓ మంద మకరందు, ఇతర అధికారులు సమీక్షించారు.

ఈ నెల 26న జోడేఘాట్‌లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వర్ధంతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గిరిజనులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

కార్యక్రమానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, రవాణా, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి వసతులను ఏర్పాటు చేయాలని తెలిపారు.

అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బందిని, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, ప్రాథమిక వైద్య సేవల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు సులభంగా కార్యక్రమ ప్రాంగణానికి చేరుకునేలా రహదారుల నిర్వహణ, సూచిక బోర్డులు, స్వాగత ఏర్పాట్లు, సమాచార కేంద్రాలు, సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

కొమురం భీం జీవితం, ఆయన పోరాట స్ఫూర్తి, ఆదివాసీల హక్కుల కోసం చేసిన ఉద్యమాన్ని ప్రతిబింబించేలా వర్ధంతి కార్యక్రమ నిర్వహణ ఉండాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ సూచించారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని తెలిపారు.

ఈ సందర్భంగా కొమురం భీం మనవడు సోనేరావు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకువచ్చారు. వర్ధంతి కార్యక్రమంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

శాఖల వారీగా అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత, ఐటీడీఏ పీఓ మంద మకరందం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, కొమురం భీం మనవడు సోనేరావు, గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.