ఆటల్లో ప్రతి ఒక్కరి పరమావధీ గెలుపే. ఎన్ని సవాళ్ళైనా స్వీకరించి, ఓటములను భరించి విజయతీరాలకు చేరుకోవాలని ప్రతి ఒక్క క్రీడాకారుడూ తపిస్తుంటాడు. దానికి తగినట్లే క్రీడామైదానాల్లో పడిపోవడాలూ-దెబ్బలు తగిలించుకోవడాలూ సర్వసాధారణమే. అలాంటి సందర్భాల్లో స్వల్ప విరామం తీసుకుని తిరిగి బరిలో నిలుస్తారు.. గాయం మరీ తీవ్రమైనది అయితే.. ఆట నుంచి నిష్క్రమించవలసిందే..

అయితే శరీరానికైన గాయం చిన్నదో.. పెద్దదో పైకి కనిపిస్తుంది కానీ, ఒక్కోసారి క్రీడాకారులు ఆటలో-గెలుపుకోసం పడే టెన్షన్-ఒత్తిడి తీవ్రం అయితే అది గుండెమీద ప్రభావం చూపుతుంది. అందుకే క్రీడాకారులు ఇలాంటి వషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. అప్పుడే బాగా ఆడగలుగుతారు. అంతేకాక గుండెమీద పడే ఒత్తిడి నుంచి కూడా తప్పించుకోగలుగుతారు. శరీరం బాగా స్ట్రెయిన్ అవుతున్న సమయంలోనే మనసు కూడా ఒత్తిడికి గురవుతే ఎంత ప్రమాదమో, ఒక్కోసారి ప్రాణాల మీదకు ఎలా వస్తుందో ఈ సంఘటన చూసినప్పుడు తెలుస్తుంది.

హైదరాబాద్ : ఇటీవ‌ల కాలంలో గుండెపోటు (HeartAttack) మరణాలు ఎక్కువ అవ‌డంతో ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా కనిపించిన వారు క్షణాల్లోనే విలవిల్లాడుతూ కుప్పకూలుతున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు.

తాజాగా నాగోల్ (Nagol) లో విషాదం చోటుచేసుకుంది. ఓ 25 ఏళ్ల యువకుడు షటిల్ (Shuttle) ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు సీపీఆర్ (CPR) చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు రాకేష్ (Rakesh) అనే యువకుడు. వెంటనే స్పందించిన అక్కడున్న యువకులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు ఖమ్మం జిల్లా (Khammam District) తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల రాకేష్(25) గా గుర్తించారు. రాకేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply