భూపాలపల్లిలో ఈ నెల 9న మెగా జాబ్‌మేళా

  • 300కు పైగా కంపెనీలతో నిర్వహణ.. యువత సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో ఫణిచంద్ర

హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మంజూరునగర్‌లోని పుష్ప గ్రాండ్‌లో ఈ నెల 9న 300కు పైగా కంపెనీలతో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను యువతీ యువకులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో అబ్బూరి ఫణిచంద్ర కోరారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో వీఓఏలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలతో జాబ్‌మేళా ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జాబ్‌మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొని వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి, వారితో దరఖాస్తులు చేయించి తప్పనిసరిగా జాబ్‌మేళాకు హాజరయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం పొందడం యువతకు ఎంతో ముఖ్యమైన అవకాశమని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ సాధనపై దృష్టి సారించాలని కోరారు. గ్రామస్థాయిలో అర్హులైన నిరుద్యోగులను గుర్తించి జాబ్‌మేళాకు అనుసంధానం చేయాలని సూచించారు.

సమావేశంలో తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ పరమేశ్వర్‌, ఏపీఎం వేణుగోపాల్‌, ఎంపీఓ రంజిత్‌, ఏపీఓ అనిత, ఏవో ప్రియదర్శిని, ఐకేపీ సీసీలు విజయ్‌కుమార్‌, శ్రీనివాసరావు, మంజుల, అనూష, వీఓఏలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.